పోలీసుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏకంగా ఆయన పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అంబేద్కర్ బొమ్మను ప్లేట్లుపై ముద్రించి అవమానపరిచారని ప్రశ్నించిన యువకులపై అక్రమ కేసులు బనాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని జైలుకు పంపడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. ఈ సంఘటనపై ఎలాంటి విచారణ చేపట్టకుండా 18మంది యువకులపై కఠినమైన కేసులు నమోదు చేయడంపై పోలీసుల తీరును తప్పుబట్టారు.
అక్రమ కేసులు నమోదు చేసిన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకునే వరకు రావులపాలెం పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళేది లేదని అక్కడే కూర్చున్నారు. నిన్న రాత్రంతా రావులపాలెం పోలీస్ స్టేషన్ లోనే నిద్రించి ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై ఎస్సీ కమిషన్ విచారణ చేస్తోంది. టీడీపీ, జనసేన నాయకులు కూడా ఆందోళన చేశారు. దళితులపై కేసులు ఉపసంహరించుకోవాలని, సీఐ, ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే జగ్గిరెడ్డికి అమలాపురం ఎంపీ చింతా అనురాధ మద్దతు తెలిపారు.