గృహ నిర్మాణ శాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ ప్రగతి, మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. ఇంకా ఎక్కడైనా అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా నిధులు మంజూరుచేసి పనులు పూర్తిచేస్తున్నామని సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. గత సమీక్షలో ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఇంకా అవసరమైన చోట ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేస్తున్నామని తెలిపారు. ఆప్షన్ –3లో ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని చెప్పారు. ఆప్షన్ –3 కింద ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని సత్వరమే పూర్తిచేయడానికి నిర్దేశించుకున్న ఎస్‌ఓపీని పాటించాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో ఉన్నాయా..? లేదా..? ఇటుకల తయారీ యూనిట్లను కాలనీలకు సమీపంలోనే పెట్టుకున్నారా..? లేదా..? తదితర వనరుల విషయంలో పరిశీలనలు చేయాలని సూచించారు. అలాగే గోడౌన్లు తదితర కనీస అవసరాలను సమకూర్చుకుని.. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా కోర్టు కేసుల వివాదాల్లోని ఇళ్లపట్టాలపై స్పష్టత కోసం ప్రయత్నించాలని, ఆగస్టు మొదటివారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంకావాలని ఆదేశించారు.