రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గిరిజన మహిళ ద్రౌపది ముర్ము మంగళవారం విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీకే కన్వెన్షన్ హాల్‌కు చేరుకోనున్న ద్రౌపది ముర్ముకు సీఎం వైయస్ జగన్ స్వాగతం పలకనున్నారు. సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో నిర్వహించే సమావేశంలో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతూ వైయస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రసంగిస్తారు. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా రాష్ట్రపతి అభ్యర్థిగా తొలి సారి గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం ఇవ్వడాన్ని స్వాగతించిన వైయస్ఆర్‌సీపీ ఇప్పటికే ఆమెకు మద్దతు తెలిపింది. ఇదే అంశాన్ని వెల్లడిస్తూ ద్రౌపది ముర్ముకు మద్దతు తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము వైయస్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడి.. మద్దతు కోరనున్నారు.