ఏపీలోని కొన్ని జిల్లాలలో నిరంతరంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా-చత్తీస్‌గఢ్ మీదుగా కొనసాగుతున్న అల్పపీడనంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. మంగళ, బుధవారాల్లో మరింత బలపడే అవకాశముంది. దీంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఆపకుండా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఒడిశా తీరానికి ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడనున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ముఖ్యంగా విజయవాడ, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి, ఏలూరు, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వానలు కురుస్తాయంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడుతున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సాయంత్రం చినుకులు.. మిగిలిన జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ వర్షాలు పడతాయని చెబుతున్నారు.
సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బోరంగులలో అత్యధికంగా 57.5 మిల్లీ మీటర్లు. చింతూరు మండలం ఎర్రంపేటలో 50 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం నుంచి అధికశాతం మండలాల్లో ఎడతెరపి లేకుండా తుంపర చినుకులు పడుతున్నాయి. తెలంగాణలో కురుస్తున్న కుండపోత వానలతో కృష్ణా, గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. గోదావరికి వరద పెరగడంతో సోమవారం రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం వద్ద 9.21 లక్షల క్యూసెక్కులను విడుదల చేశారు. ఇటు తెలంగాణ నుంచి వస్తున్న వరదతో ప్రకాశం బ్యారేజి ప్రవాహం పెరిగింది. దీంతో వరదను దిగువకు వదిలారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ముందుగానే అప్రమత్తం చేశారు.