ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అన్న పాటను సరిగ్గా అర్థంచేసుకొన్నట్లుంది ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో. అందుకే టాలెంట్ ఉన్న ఉద్యోగులు చేజారి పోకుండా ఆ కంపెనీ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగుల వేతనాలు ఏడాదికి ఒకసారి పెరుగుతాయి. అలాగే కంపెనీలు ఏడాదికి ఒకసారి మాత్రమే ఎంప్లాయీస్‌కు ప్రమోషన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మాత్రం కంపెనీలు కొత్త మార్గంలో పయనిస్తున్నాయి. మూడు నెలలకు ఒకసారి ప్రమోషన్ విధానానికి తెరతీశాయి. అదేంటి 3 నెలలకు ఒకసారి ప్రమోషనా? అని అనుకుంటున్నారా? అవును మీరు చదివింది నిజమే. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. బాగా పని చేసే ఉద్యోగులను వేరే కంపెనీలకు పోకుండా చూసుకునేందుకు, అలానే టాలెంట్ ఉన్న వారికి తమ వద్దే అంటిపెట్టుకోవడానికి ఈ మూడు నెలల ప్రమోషన్ తాయిలాన్ని తీసుకువచ్చింది. జూలై నుంచి అంటే ఈ నెల నుంచి ఈ విధానం అమలులోకి వచ్చింది. లీడర్‌షిప్ టీమ్‌లో లేని టాప్ పర్ఫార్మర్లకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.
‘రానున్న కాలంలో టాప్ పర్ఫార్మర్లకు మూడు నెలలకు ఒకసారి ప్రమోషన్లు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. మిడ్ మేనేజ్‌మెంట్ లెవెల్ వరకు ఈ ప్రమోషన్స్ లభిస్తాయి. కంపెనీ సెప్టెంబర్ నెలలో జీతాలు పెంచే అవకాశం ఉంది. అలాగే జూలైలో పెద్ద సంఖ్యలో ప్రమోషన్లు ఉంటాయి’ అని విప్రో కంపెనీ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఐటీ కంపెనీల్లో సాధారణంగానే వలసలు ఎక్కువగా ఉంటాయి. అయితే గత కొన్ని త్రైమాసికాలుగా అట్రిషన్ రేటు చాలా ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఎందుకంటే డిజిటల్ స్కిల్స్ కలిగిన ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరిగింది. అలాగే లేబర్ కాస్ట్ కూడా పైపైకి చేరుతోంది. దీంతో పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రతిభవంతులైన ఉద్యోగులను ఆకర్షించడం, శిక్షణ, వారిని నిలుపుకోవడం వంటివి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ఇదిలవుంటే గత వారంలో దేశీ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు ఐటీ సర్వీసెస్ అట్రిషన్ రేటు 19.7 శాతానికి చేరింది. ఈ అంశంపై టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ మాట్లాడుతూ.. సంబంధిత సీజన్‌లో అట్రిషన్ రేటు పెరుగుదల సర్వ సాధారణమని తెలిపారు. రెండో త్రైమాసికంలో అట్రిషన్ రేటు తగ్గొచ్చని పేర్కొన్నారు. క్యూ1 లో జూనియర్లు స్టడీస్ కోసం జాబ్ మానేస్తూ ఉంటారని తెలిపారు. క్యూ2లో అట్రిషన్ రేటు తగ్గొచ్చన్నారు.