ఏపీఎస్ ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటీజన్ కు ఇది నిజంగా శుభవార్తే. ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇకపై డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధప్రదేశ్‌లో 60 ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి రాయితీ అమల్లోకి వచ్చింది.. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా కారణంగా ప్రభుత్వం 2020 మే 21 నుంచి ఈ రాయితీని నిలిపివేసింది. కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో మళ్లీ రాయితీని పునరుద్ధరించారు.
ఈ రాయితీ కోసం సీనియర్ సిటిజన్లు గుర్తింపు కార్డుల్ని చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు, రేషన్ కార్డు వంటివి చూపించి ఏసీ సర్వీసులతో సహా అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీల్లో రాయితీ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు ఈ రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.