లోన్ యాప్ ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రుణం తిరిగి చెల్లించాలన్న పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే లోన్ యాప్ వేధింపుల కారణంగా ఏపీలో మరో మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు లోన్ యాప్ వేధింపులే కారణమని సదరు మహిళ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంగళగిరి పరిధిలోని చినకాకానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకెళితే... చినకాకానికి చెందిన ప్రత్యూష అనే యువతి ఓ లోన్ యాప్ ద్వారా రూ.20 వేలు రుణంగా తీసుకుంది. అందులో ఇప్పటికే ఆమె రూ.12 వేలు చెల్లించింది. అయితే మిగిలిన మొత్తాన్ని సోమవారం ఉదయం 7 గంటలలోగా చెల్లించాలని లోన్ యాప్ సిబ్బంది ఆమెకు ఆదివారం రాత్రి గడువు విధించారు. ఆ గడువులోగా రుణం చెల్లించకుంటే తప్పుడు ప్రచారం చేస్తామని కూడా బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె తనకు జరిగిన అన్యాయంపై సెల్ఫీ వీడియో రికార్డు చేసి ఆపై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.