ప్రధాని నరేంద్ర మోడీ తీరును టీఎంసీ ఎంపీ ఖండించారు. జాతీయ చిహ్నాన్ని అవమానించారంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. గాంభీర్యంగా, నిబ్బరంగా ఉండాల్సిన విధంగా కాకుండా గర్జించే, దూకుడుగా కనిపించే సింహాన్ని పెట్టారని ఆరోపణలు చేశారు. ఇది మన జాతీయ చిహ్నాన్ని అవమానించడమేనని, ఇది సిగ్గుచేటని... తక్షణమే ఈ చిహ్నాన్ని మార్చాలని రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెండు చిత్రాలను పోస్ట్ చేస్తూ "అసలు ఎడమ వైపున ఉంది. మనోహరమైనది, నమ్మకంగా ఉంది. కుడివైపున ఉన్నది మోడీ వెర్షన్, కొత్త పార్లమెంటు భవనం పైన పెట్టినది. మొరటుగా, అనవసరమైన దూకుడుగా..అసమానంగా ఉంది. సిగ్గు చేటు వెంటనే మార్చండి." అంటూ జవహార్ సిర్కార్ ట్వీట్ చేశారు. అలాగే గత జాతీయ చిహ్నం, ప్రస్తుత చిహ్నాన్ని పక్కపక్కన ఉంచిన ఫోటో ఇమేజ్‌ను లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా కూడ ట్వీట్ చేశారు.
ఇదిలావుంటే ఇక కొత్త పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ప్రధాని ఆవిష్కరించడాన్ని సీపీఎం, కాంగ్రెస్, ఎంఐఎంలు తప్పుబట్టాయి. పార్లమెంట్‌లో కార్యక్రమాన్ని స్పీకర్ చేతుల మీదుగా ఆవిష్కరించాలని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు. బీజేపీ మాత్రం దురుద్దేశంతో విపక్షాలు విమర్శిస్తున్నాయిన కొట్టిపారేసింది. కాగా కొత్త పార్లమెంట్‌పై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని సోమవారం మోదీ ఆవిష్కరించారు. ఈ చిహ్నం కొత్త పార్లమెంట్ భవనం ప్రాజెక్ట్‌లో ఒక భాగం. ఇది టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న ప్రభుత్వ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను హైలైట్ చేస్తుంది.