పద్మ అవార్డుల కోసం 28,121 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ ఇప్పటికే ప్రారంభం కాగా.. మంగళవారం నాటికి 28,121 నామినేషన్లు అందాయి. ఈ మేరకు పద్మ అవార్డులకు ఆయా వ్యక్తుల ఎంపిక, అవార్డుల పంపిణీల కోసం ఏర్పాటు చేసిన నేషనల్ అవార్డ్స్ కమిటీ మంగళవారం ఓ ప్రకటన చేసింది. ఆయా రంగాల్లో మీరు మెచ్చిన హీరోలను పద్మ అవార్డులకు ప్రతిపాదించండి అంటూ ఆ శాఖ తన ప్రకటనలో దేశ ప్రజలకు పిలుపునిచ్చింది.
పద్మ అవార్డులను 3 కేటగిరీల కింద అందజేస్తున్న సంగతి తెలిసిందే. పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పేరిట ఇచ్చే ఈ అవార్డులను ఏటా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మే నెల 1 నుంచి మొదలైన 2023 ఏడాదికి సంబంధించిన పద్మ అవార్డుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 15తో ముగియనున్నట్లు పద్మ అవార్డ్స్ శాఖ ప్రకటించింది.