బ్లాస్ట్ ప్రూఫ్ పద్దతిలో గ్యాస్ సిలిండర్ వచ్చేసింది. దీనిని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రూపొందించింది. ఇంటిలో గ్యాస్ సిలిండర్ ఉందంటే... జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదంటే... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా... సిలిండర్ పేలిందంటే... అది పేలిన ఇల్లుతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లను దహించి వేస్తుంది. వెరసి ఇంటిలో గ్యాస్ సిలిండర్ ఉందంటే... పేలుడు పదార్థంపై కూర్చున్నట్లే లెక్క. గ్యాస్ సిలిండర్‌తో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఇప్పటిదాకా చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాం కదా. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకున్నా... గ్యాస్ సిలిండర్ పేలదు. ప్రమాదం అన్న మాటే ఉత్పన్నం కాదు. ఈ దిశగా సరికొత్త గ్యాస్ సిలిండర్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది.
పేలుడు మాటే వినిపించని రీతిలో గ్యాస్ సిలిండర్‌ను బ్లాస్ట్ ప్రూఫ్ పద్దతిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) రూపొందించింది. ఇండేన్ పేరిట ఐఓసీఎల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ రూపొందించిన కొత్త సిలిండర్ ఎలాంటి పరిస్థితిలో కూడా పేలదట. సాధారణంగా గృహ వినియోగం కోసం మనం వాడుతున్న సిలిండర్లలో 14 కేజీల గ్యాస్ వస్తుండగా... ఈ బ్లాస్ట్ ప్రూఫ్ సిలిండర్ మాత్రం 10 కేజీల్లో మాత్రమే లభ్యమవుతుందట. ఈ సిలిండర్‌ను సోమవారం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) మేయర్ గుండు సుధారాణి ఆవిష్కరించారు.