ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గోదారి ఉగ్రరూపం దాల్చింది. కడెం, భద్రాచలం, ధవళేశ్వరం సహా అనేక ప్రాజెక్టుల్లో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో నదీపరివాహక ప్రాంతాల్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లోని పలు గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. కోనసీమ జిల్లాలోని పలు లంక గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. భారీగా వరద నీరు చేరుకోవడంతో అనేక కాజ్ వే లు, లంక గ్రామాలు మునిగిపోయాయి. పలు గట్టులు తెగిపోవడంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
జిల్లాలోని సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక- టెకిశెట్టిపాలెం కాజ్వే పైకి వరద నీరు చేరింది. కాజ్వే మునిగి పోవడంతో లంక గ్రామాల ప్రజలకు రాకపోకలు కష్టతరంగా మారాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల్లోని ఇళ్ళలోకి వరద నీరు వచ్చి చేరుతోంది . ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వరద ప్రాంతాల్లో పర్యటించి గ్రామాలకు విద్యుత్ , నీరు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు తూతూ మంత్రంగా అధికారులు చర్యలు చేపడుతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు సరైన సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. విష పురుగులు, పాముల నుంచి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని వరద బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.