గతాన్ని ఘటనగా.. ప్రస్తుతమంతా కర్తవ్యంగా చూడాలని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు. భవిష్యత్తు మాత్రం ఈ రెండిటి కలయిక అని గుర్తించాలి అంటున్నారు. వివిధ సంఘటనలు ఎందుకు జరుగుతాయి అనేది ఒక నిగూఢమైన విషయమని ఆయన పేర్కొన్నారు. గతమంతా ఒక ఘటన అని.. ప్రస్తుతం మాత్రమే 'మన కర్తవ్యం' అని అర్థం చేసుకోవడం ఆరోగ్యకరమైన ఆలోచనగా అభివర్ణించారు. గతానికి 'మనమే' కర్తలుగా ఆలోచిస్తే అహం, బాధ వెంటాడుతాయి అన్నారు. మరోవైపు ప్రస్తుతాన్ని ఘటనగా చూస్తే సోమరితనం, నిరాసక్తి కలుగుతాయన్నారు.
జ్ఞానులు జరిగిన ఘటనలో తమ పాత్రను తమ కర్తవ్యంలో జరిగిన ఘటనలను చూస్తారని రవిశంకర్ అన్నారు. పనిమంతుడు ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోడని.. ఇతరులు అతను చేసిన పని గురించి చెబుతున్నారంటే అతనింకా ఎంతో చేయగలడనే అర్థమని.. పని చేయడం వల్ల కంటే తాను పని చేశాను అని భావన వల్ల అలసట కలుగుతుందన్నారు. అన్ని పనులు వివేకం ద్వారానే జరుగుతాయని.. ఈ ప్రపంచ గమనం మొత్తం వివేకం ద్వారానే కలుగుతుందని వివరించారు.
ఈ వివేకం మూడు రూపాల్లో కనిపిస్తుందని.. జ్ఞాన శక్తి, ఇచ్చా శక్తి, క్రియా శక్తి.. దీన్నే జ్ఞానము, వాంచ, పని అంటారన్నారు. ఈ మూడు శక్తులు కలిస్తే జీవితం సాఫీగా సాగుతుంది.. లేకపోతే జీవితం ఒడిదొడుకులు తప్పవని హెచ్చరించారు. చాలాసార్లు 'మనం చేయాలని అనుకున్న పనులు చేయలేకపోతుంటాం.. లేదా మంచి పనులు అనుకున్న వాటిని జాగు చేస్తూ ఉంటాం.. చేయాలనే తపన ఉంది, చేస్తే మంచిది అన్న జ్ఞానం కూడా ఉంది.. కానీ చేయడానికి అవసరం అయిన క్రియా శక్తి లేదు' అన్నారు.
శ్రీ శ్రీ రవిశంకర్ఇచ్చా శక్తి అంటే చేయాలనే తపన, జ్ఞాన శక్తి అంటే చేస్తే మంచి జరుగుతుంది అన్న అవగాహన.. క్రియ శక్తి అంటే అనుకున్న పనిని కార్యరూపంలో మార్చగలిగిన శక్తిగా అభివర్ణించారు. కొందరికి క్రియా శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ జ్ఞాన శక్తి ఉండదని.. అంటే వాళ్ళకు ఏదో చేయగలిగే సామర్థ్యం ఉంటుంది కానీ ఏం చేస్తే మంచిది అనే అవగాహన ఉండదన్నారు. దీని వల్ల వాళ్ళు తృప్తి లేకుండా ఉంటారని.. మరోవైపు ఇంకొందరికి క్రియా శక్తి లేకపోవడం వల్ల ఏం చేయాలని అనిపించినా చేసే సామర్థ్యం ఉండదన్నారు. అలాంటి వాళ్ళు ఏ పని చేయకపొయినా వారి మెదడు పరిగెడుతూ ఉంటుందని వివరించారు.
ఇంకొందరికి ఇచ్చా శక్తి తక్కువగా ఉంటుందని.. వీళ్ళు కొంత సేపు ఒక పని మొదలుపెట్టి మరో నిమిషంలో ఇంకో పనికి పూనుకుంటారన్నారు రవిశంకర. వీళ్ళకు పని పూర్తి చేసే ఓపిక ఉండదని.. సోమరితనం ఇచ్చా శక్తి లేకపోవడనికి ఒక పెద్ద ఉదాహరణగా చెప్పారు. కొందరికి అపారమైన జ్ఞానం ఉంటుంది కానీ దాన్ని ఇతరులతో పంచుకునే అలవాటు ఉండదన్నారు. ఇది జ్ఞాన శక్తి ఉన్నా కూడా ఇచ్చా శక్తి లేకపోవడానికి ఉదాహరణగా తెలిపారు. మూడు శక్తులు కలిసి ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది అన్నారు.
'చేయాలనే తపన, తమ గురించిన అవగాహన, పని చేసే సామర్థ్యం కలిపితే వచ్చే శక్తి నీవు' అన్నారు గురు దేవ్ రవిశంకర్. కొన్నిసార్లు వీటిలోని ఒకే శక్తి ఎక్కువగా బయటకు వస్తుందని.. వాంచ ఎక్కువగా ఉంటే తమ గురించిన అవగాహన తక్కువగా ఉంటుందన్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా తత్వవేత్తలు కోరికలను విడనాడాలని పిలుపునిచ్చారు.. సచేతనావస్థలో ఉన్నప్పుడు అనందం కలుగుతుంది, కోరికల వల్ల బాధ కలుగుతుందన్నారు.
విపరీతంగా పని చేయడం వల్ల నిరాసక్తి కలుగుతుందని.. 'మీ ఆలోచనలు, పనులు ఆ పరమాత్మకు లేదా సమాజ శ్రేయస్సుకు అనుసంధించబడి ఉంటే మీకు తెలియకుండానే సచేతనావస్థ కలిగి మీ గురించిన అవగాహన కలుగుతుంది' అన్నారు. పెద్ద మెదడు, చిన్న మెదడు అని రెండు ఉన్నాయి.. కొన్ని సార్లు పెద్ద మెదడు చిన్న మెదడు మీద ఆధిపత్యం చూపుతుంది మరికొన్ని సార్లు చిన్న మెదడు పెద్ద మెదడు మీద ఆధిపత్యం చూపుతుందని వివరించారు. చిన్న మెదడు వల్ల బాధ, పెద్ద మెదడు వల్ల ఆనందం కలుగుతాయని.. చిన్న మెదడు ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటాం కానీ అది దక్కదని అభిప్రాయపడ్డారు. పెద్ద మెదడుకు కొంత ప్రతిఘటన ఎదురైనా ఎక్కువ కాలం ఆనందం దక్కుతుంది అన్నారు.