మూడేళ్ల చిన్నారి పట్ల తల్లి, అమ్మమ్మ కర్కశంగా వ్యవహరించారు. ఆ చిన్నారని సజీవంగా పూడ్చిపెట్టారు. కానీ ఆమె ప్రాణాలతో బయటపడగలిగింది. మూడేళ్ల చిన్నారి బతికి ఉండగానే.. కన్న తల్లి, అమ్మమ్మ కలిసి శ్మశానంలో పాతిపెట్టిన ఘటన బిహార్‌లోని సరాన్ జిల్లాలో వెలుగు చూసింది. సోమవారం ఉదయం శ్మశానం సమీపంలో కలప సేకరించడానికి వెళ్లిన మహిళలకు బాలిక అరుపులు వినిపించాయి. ఆ అరుపులు విన్న వారు.. ముందుగా దెయ్యలేమో అనుకొని భయపడ్డారు. దీంతో ఊళ్లో వాళ్లకు కబురు పెట్టారు. వారు వచ్చి ఆ శబ్దాలను జాగ్రత్తగా గమనించగా.. ఎవరినో బతికి ఉండగానే పూడ్చిపెట్టినట్లు గుర్తించారు.
వెంటనే మట్టిని తొలగించి చూసిన గ్రామస్థులకు మూడేళ్ల చిన్నారి కనిపించింది. ఆ బాలిక నోటి నిండా మట్టి నింపి ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. వెంటనే బాలికకు చికిత్స అందించడం కోసం కోపాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాలికను పరిశీలించిన డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. దీంతో కోలుకున్న బాలిక.. తన పేరు లాలి అని.. రాజు శర్మ, రేఖా శర్మ తన తల్లిదండ్రులని తెలిపింది. కానీ తమ ఊరి పేరు మాత్రం చెప్పలేకపోయింది.
అమ్మ, అమ్మమ్మ తనను శ్మశానం సమీపంలోకి తీసుకొచ్చారని బాలిక చెప్పింది. నేను ఏడుస్తుండటంతో.. నోట్లో మట్టి కుక్కి.. మట్టి కింద పూడ్చిపెట్టారని చెప్పింది. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా ఆమె తల్లిదండ్రులు, గ్రామాన్ని గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నాలు ప్రారంభించారు. రెండేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సిద్ధార్థ్‌నాథ్ జిల్లా సోనౌరా గ్రామంలో నవజాత శిశివును పూడ్చిపెట్టారు. బాబు గుక్కపెట్టి ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు.. గుంతలో నుంచి వెలికి తీసి కాపాడారు