ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారు రాజీనామా చేస్తేనే పరిస్థితులు అదుపులోకి: జయ సూర్య

international |  Suryaa Desk  | Published : Wed, Jul 13, 2022, 09:17 PM

దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది శ్రీలకం అధ్యక్షుడు, ప్రధానిల రాజీనామాలే అని క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య స్పష్టం చేశారు. ఎంతో అందమైన దేశంగా, పర్యాటకుల పాలిట స్వర్గంలా ఒకప్పుడు గుర్తింపు పొందిన శ్రీలంక ఇప్పుడు కల్లోలభరిత దేశంగా నిత్యం నిరసన జ్వాలలతో రగులుతోంది. శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితులపై సనత్ జయసూర్య స్పందించారు. జులై 9 తర్వాత దేశంలో చెలరేగిన ఆందోళనలకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని రణిల్ విక్రమసింఘేలే కారణమని ఆరోపించారు. 


వారు తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి మాట తప్పారని, ఇప్పటికీ పదవులను అంటిపెట్టుకునే ఉన్నారని విమర్శించారు. శ్రీలంక ప్రజలకు వారిద్దరిపై పూర్తిగా నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వస్తున్నా వారు ఖాతరు చేయడంలేదని మండిపడ్డారు. దేశంలో చెలరేగుతున్న ఆందోళనలు నిలిచిపోవాలంటే ఏదైనా మార్గం ఉందంటే అది వారి రాజీనామాలే అని జయసూర్య స్పష్టం చేశారు. 


నిరసనలు ఇలాగే కొనసాగాలని ఎవరూ కోరుకోవడంలేదని, పరిస్థితులే ప్రజలను ఆ దిశగా పురిగొల్పుతున్నాయని వివరించారు. దీనికి ఎక్కడో ఓ చోట చరమగీతం పాడాలని, వీలైనంత త్వరగా ప్రశాంత జీవనంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నామని జయసూర్య తెలిపారు. శ్రీలంకకు అనేక సందర్భాల్లో భారత్ ఎంతో సాయపడిందని, కానీ సాయం చేయాలంటూ భారత్ ను ఎన్నిసార్లు అడగ్గలం? అని వ్యాఖ్యానించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సొంతంగా ఏదైనా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని జయసూర్య అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com