దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ తీరంతో పాటు మధ్య భారతంలోని ప్రాంతాల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంది. ఈ రోజు 8 రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.22 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణం కన్నా అధికంగా వరద పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్‌లలోని 31 డ్యామ్‌లకు వరద పోటెత్తుతోంది.
మహారాష్ట్ర భారీ వర్షాలతో అల్లాడుతోంది. పాల్ఘర్, పూణే జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా్యి. చించ్వాడ్ లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నిన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ నగరంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. గోండియా జిల్లాలో నలుగురు వ్యక్తులు నీటిలో గల్లంతయ్యారు. గుజరాత్ రాష్ట్రం వానల ధాటికి అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 30 జలాశయాలు 70 శాతం సామర్థ్యాన్ని దాటాయాి. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాజ్ కోట్, గిర్ సోమనాథ్, జామ్ నగర్, భరూచ్, కచ్, నవ్సారి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
మధ్యప్రదేశ్ నర్మదాపురం డివిజన్ లోని అన్ని జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు వర్షాలకు తడిసిముద్దవుతున్నాయి. గోదావరి నది అవుట్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా.. ఇన్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గత 5 రోజుల్లో 219.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. 455 శాతం అధిక వర్షపాతం నమోదు అయింది.
కోస్తా కర్ణాటక, మల్నాడు ప్రాంతాల్లో అనేక చోట్ల వరదలు సంభవిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తుంగభద్ర నదీ ప్రవాహం తీవ్ర స్థాయిలో పెరిగింది. దీంతో హంపిలోని వారసత్వ ప్రదేశాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇక తమిళనాడులోని కోయంబత్తూర్, నీలగిరి, ధర్మపురి జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. ఒడిశాలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచానా వేసింది.