శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుగ్గా ఉండాలన్నా వాకింగ్ చేయడం చాలా అవసరం. ఉదయం కనీసం అరగంటైనా నడిస్తే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిదని చెబుతారు.కానీ చాలా మందికి ఉన్న సందేహం వాకింగ్ ఉదయానే చేస్తేనే మంచిదా? మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పడుకునే ముందు చేయకూడదా? అని. దీనికి ఆరోగ్యనిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
ఉదయాన శరీరం, మెదడు తాజాగా ఉంటాయి. కాకపోతే ఉదయం పూట వచ్చే కాంతి శరీరానికి మేలు చేస్తుంది. శరీరానికి సహజ కాంతి చాలా అవసరం. మనకళ్ల వెనుక ఉండే సెన్సార్లు ఆ కాంతిని గుర్తించి మెదడులోని హైపోథాలమస్ ప్రాంతానికి సిగ్నల్స్ పంపిస్తాయి. ఎందుకంటే ఆ ప్రాంతమే మన జీవగడియారాన్ని నియంత్రించడంలో ముందుంటుంది. ఉదయానే వాకింగ్ చేయడం వల్ల సూర్య కాంతి శరీరంపై, కళ్లపై పడి జీవగడియారం సక్రమంగా పనిచేస్తుంది. ఉదయానే మీరు ఎంత త్వరగా లేస్తే రాత్రి పూట అంత త్వరగా నిద్ర పోతారు. జీవగడియారం అలా టైమింగ్స్ సెట్ చేసుకుంటుంది. అంతేకాదు సహజకాంతి శరీరాన్ని చేరడం వల్ల సెరోటోనిన్ అనే రసాయనం విడుదల అవుతుంది. ఈ రసాయనమే మనలో ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ లాభాలు కావాలంటే ఉదయానే నడవాలి.
ఎప్పుడైనా నడవచ్చు
ఉదయాన మాత్రమే నడవాలి అన్న నియమమేదీ లేదు. శరీరం చురుగ్గా ఉండేందుకు మీకు వీలయ్యే సమయంలో నడవచ్చు. రోజులో కనీసం అరగంట సేపు చెమటపట్టేలా నడిస్తే చాలా మంచిది. చాలా మంది మెల్లగా నడుస్తూ వాకింగ్ ను పూర్తి చేస్తారు. అలా మెల్లగా నడవడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. చేతులు ఊపుతూ వేగంగా నడిస్తేనే ఫలితం ఉంటుంది. క్యాన్సర్ ముప్పు తగ్గడంతో పాటూ, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. ఇలా వేగంగా వాకింగ్ చేసేవారిలో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ.
మిగతా వ్యాయామాలతో పోలిస్తే నడక చాలా భిన్నం. మిగతా శారీరక ఎక్సర్ సైజులు చేసేందుకు ప్రత్యేకంగా ఓ సమయం కావాలి. కానీ నడక ఎప్పుడైనా చేసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. రోజులో రెండు మూడు సార్లు, వీలైన సమయంలో నడక సాగించవచ్చు. ఏది ఏమైనా రోజులో మాత్రం కచ్చితంగా వాకింగ్ చేయాలి.
భోజనం చేశాక వాకింగ్ చేస్తే బాన పొట్ట వచ్చే అవకాశం తగ్గుతుంది. పొట్ట పట్టేసినట్టు అవ్వదు. తిన్నాక కనీసం పదినిమిషాలు నడిచేందుకు ప్రయత్నించాలి.