మారికవలసలో ఉన్న లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వకపోవడంతో వాళ్లంతా రోడ్డున పడ్డారు. దీంతో బాధితులు ఇక్కడి పీఎంపాలెం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తామిక్కడ 2005నుంచి రాత్రనక, పగలనక పనిచేస్తూ వచ్చామని, 130 మంది ఉద్యోగులకు గత జనవరి నుంచీ యాజమాన్యం జీతాలివ్వడం లేదని, అయినప్పటికీ గత మే 31వరకు తాము పనిచేశామని గుర్తు చేశారు. అయితే ఆ సంస్థను ఎత్తివేస్తున్నట్టు జూన్ 1న పత్రికల్లో ప్రకటన చూసి ఆవేదనకు గురయ్యామని బాధితులు పోలీసులికిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
జీతాలపై నిర్వాహకుల్ని ప్రశ్నిస్తే ఇన్నాళ్ల పాటు తమతో కలిసి పనిచేసినందుకు ధన్యవాదాలని, సమస్యలపై ఇప్పటికే యాజమాన్యం తో మాట్లాడుతున్నట్టు చెప్పారు తప్పితే మిగతా విషయాల్లో పట్టించుకోలేదని వివరించారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ నుంచి కూడా స్పందన లేదని, తీరా చూస్తే ఆ షోరూంలో వేరే నిర్వాహకులు కనిపించారని, తమను విధుల్లోకి అనుమతించలేదని బాధితులు పేర్కొన్నారు. తమ పరిస్థితిపై ఏమీ చెప్పకుండా వారు మాత్రం వ్యాపారం చేసుకుంటే తామంతా ఏమైపోవాలని బాధితులు ప్రశ్నించారు. తమ సమస్య పరిష్కారం కాకుండా, 130కుటుంబాలు రోడ్డున పడకుండా, లీలా కృష్ణ ఆస్తులేవీ విక్రయించకుండా చూడాలని బాధితులు పోలీసుల్ని కోరారు.