సీఐడీ కేసు విషయంలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసును కోర్టు కొట్టి వేసింది. కృష్ణ కిషోర్‌పై జగన్ సర్కారు సీఐడీ ద్వారా పెట్టించిన కేసు అక్రమమే అని తేల్చింది. ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో జాస్తి అవకతవకలకు పాల్పడ్డారని మంగళగిరి సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే 2019లో కృష్ణ కిషోర్‌ను సస్పెండ్ కూడా చేశారు. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి నివేదిక తర్వాత కేసు ఫైల్ చేశామని చెప్పారు. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సీఐడీకి ప్రభుత్వం సూచించింది. విచారణ పూర్తయ్యే వరకు అమరావతి విడిచి వెళ్లొద్దని ఆయన్ను ఆదేశించింది.
జాస్తి కృష్ణ కిషోర్ తన సస్పెన్షన్‌పై క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ ఉత్తర్వులపై కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ స్టే విధించింది. అనంతరం కృష్ణ కిషోర్‌పై సస్పెన్షన్ చెల్లదని జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ చేపట్టిన క్యాట్ హైదరాబాద్ బెంచ్ తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్‌లు చెల్లవని హైకోర్టు క్వాష్ చేసింది. కృష్ణ కిషోర్ వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు.. లాభ పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవని తేల్చింది.
గతంలో భజన్ లాల్ కేసులో సుప్రీం కోర్టు నిర్థేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ కేసు కొట్టి వేసింది. గతంలో హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ సర్కిల్‌లో పని చేసిన సమయంలో.. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌పై వస్తున్న ఆదాయానికి పన్నులు కట్టమని నోటీసులు జారీ చేసినట్లు జాస్తి పిటిషన్‌లో ప్రస్తావించారు. అది మనసులో పెట్టుకుని కక్షసాధింపులో భాగంగా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను సస్పెండ్ చేసి తప్పుడు కేసు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో విచారణ జరిపిన కోర్టు కేసులపై ఆధారాలు సమర్పించడంలో సీఐడీ విఫలమైందని..ఈ కేసులన్నింటినీ కొట్టివేసింది.