అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని.. అధికారం అంటే అజమాయిషీ కాదు ప్రజలపై మమకారం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీఎం ఇలా వ్యాఖ్యానించారు.
అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు. కొంతమందికి అర్హతలు ఉన్నా సరే పథకాలు అందలేదు. అలాంటి వారి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 3,39,096 మంది లబ్ధిదారులకు రూ.137 కోట్లను వర్చువల్ విధానంలో అకౌంట్‌లలో జమ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ తాజాగా రాష్ట్రంలో మరో మూడు లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదనేదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని జగన్ అన్నారు. అవినీతికి తావు లేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాలని మంత్రులకు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 3,39,096 మంది లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారని.. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపి చేశామని.. కొత్తగా 7,051 మందికి బియ్యం కార్డులు, 3,035 మందికి ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.