ఏదైనా సహాయం చేస్తే ప్రజలు ప్రశంసిస్తారు అన్నది ఎంత నిజమో ప్రజాపయోగ కార్యక్రమం చేసినా వారు ప్రశంసిస్తారు అన్నది మరోసారి స్పష్టమైంది. ఏపీ బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ వినూత్నంగా.. తన ఫ్లెక్సీలను ఆయనే తొలగించారు. మంగళవారం ఉదయం రామచంద్రపురంలో ప్రజలకు అసౌకర్యంగా ఉన్న తన ఫ్లెక్సీలను స్వయంగా తొలగించే కార్యక్రమం చేపట్టారు. తన సిబ్బంది సాయంతో అక్కడి నుంచి తీసివేశారు. మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణకు స్వాగతం పలుకుతూ స్థానికంగా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తన ఫ్లెక్సీల లవల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిసి స్వయంగా ఆయనే తొలగించడం విశేషం. మంత్రిపై మంచి పనిచేశారంటూ స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చెల్లుబోయిన వీడియోలు, ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతల కోసం అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని సమయాల్లో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే స్థానిక అధికారులు జరిమానాలు కూడా విధించారు. కానీ ఇక్కడ మాత్రం మంత్రి బాధ్యతగా వ్యవహరించారు.