ప్రకాశం జిల్లా టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. దర్శి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు పమిడి రమేష్ ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని, తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. టీడీపీ జెండా రెపరెపలాడటానికి దర్శి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పని చేశానని, రాబోయే రోజుల్లో ఇతర నాయకులతో పాటు తాను కూడా నియోజకవర్గంలో టీడీపీ గెలుపునే కోరుకుంటున్నానని చెప్పారు. తనకు ఇంతకాలం సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
‘మహానాడు తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. కొంతమంది ఆశావహులు దర్శి నియోజకవర్గంలో పోటీచేసేందుకు ఉత్సాహం చూపించారు. అధిష్టానం పిలవకపోయినా.. నేనే ప్రస్తావిద్దామని వెళ్లాను. అక్కడ పరిస్థితి, నేను ఇంతకాలం చేసిన పనికి, వాళ్లకు నా మీద ఉన్న అభిప్రాయానికి ఎలాంటి పొంతన లేదు. దీని గురించి విమర్శనాత్మకంగా మాడ్లాడటానికి ఇష్టపడటం లేదు. పార్టీ అధికారంలోకి రావడం మన ధ్యేయం, దర్శి నియోజకవర్గంలో టీడీపీ గెలవడం మన ఆశయం’అన్నారు. పమిడి రమేష్ ఉన్నట్టుండి ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.
2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గ నుంచి కదిరిబాబూరావు టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బాబూరావు వైసీపీలో చేరారు. కొద్దిరోజుల తర్వాత పార్టీ అధిష్టానం పమిడి రమేష్‌కు ఇంఛార్జ్ పదవిని అప్పగించింది. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేశారు. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. మహానాడు సమయంలో కూడా రమేష్ ఉత్సాహంగా పనిచేశారు. కానీ నియోజకవర్గంలో పార్టీకి తిరుగులేదనుకునే సమయంలో ఆయన పదవి నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
అంతేకాదు రమేష్ కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. మహానాడు సమయంలో దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి ఎమ్మెల్యే నందమూరి బాలయ్యతో కలిసి చంద్రబాబు దగ్గరకు వెళ్లారట. తనకు అవకాశం ఇస్తే దర్శి నుండి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారట. ఆ తర్వాత నియోజకవర్గంలో సీన్ మారిపోయిందని.. రమేష్ కూడా అందుకే తప్పుకున్నారా అనే చర్చ మొదలైంది. అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఓ కుదుపులా పమిడి రమేష్ రాజీనామా ఇబ్బందిగా మారింది. టికెట్ తనకు దక్కదనే కారణంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారా అనే చర్చ జరుగుతోంది.