అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని ప్రభుత్వ విప్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెం.67తో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. విప్ గా ధర్మశ్రీ రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. విద్యాధికుడైన కరణం ధర్మశ్రీ నాలుగుసార్లు ఎన్నికల్లో పోటీచేయగా, రెండుసార్లు విజయం సాధించారు. ఆయన తొలుత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో మాడుగుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 2009లో చోడవరం నుంచి బరిలో దిగిన ఆయనకు ఓటమి ఎదురైంది.
తదనంతర పరిణామాల నేపథ్యంలో కరణం ధర్మశ్రీ వైఎస్ జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చోడవరం నుంచి బరిలో దిగి ఓటమిపాలయ్యారు. 2019లో జగన్ ప్రభంజనంలో చోడవరం నుంచి విజయం సాధించారు. సీఎం జగన్ కు నమ్మినబంటుగా గుర్తింపు పొందారు. కరణం ధర్మశ్రీ ఇటీవలే డీఎస్సీ కొలువు సాధించడం విశేషం. సీఎం జగన్ చొరవతో 1998 డీఎస్సీ అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు పొందడం తెలిసిందే. వారిలో కరణం ధర్మశ్రీ కూడా ఉన్నారు. కరణం ధర్మశ్రీ ఇటీవల మంత్రి పదవిని ఆశించినట్టు ప్రచారంలో ఉంది. అయితే నూతన మంత్రివర్గంలో ఆయనకు స్థానం లభించలేదు.