ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ అయిదు సోలార్ పార్క్‌లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఆ అయిదు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి...అనంతపురంలో 1500 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ పార్క్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. అనంతపురం జిల్లాలోని ఎన్‌పీ కుంట, కడప జిల్లాలోని గాలివీడులో 9592 ఎకరాలలో ఇప్పటికే 1400 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. మరో 100 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ డెవలపర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయాల్సి ఉందని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే కర్నూలు జిల్లా గని, శకునాల గ్రామాల్లో 1000 మెగా వాట్ల సామర్ధ్యంతో 5568 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్ పార్క్ ప్రారంభమైనట్లు చెప్పారు. కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్ధ్యంతో 5600 ఎకరాలలో ప్రారంభించిన సోలార్ పార్క్ పనులు పురోగతిలో ఉన్నాయి.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు, ఆలూరు గ్రామాల్లో 2751 ఎకరాల్లో 500 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న సోలార్ పార్క్‌కు సంబంధించి మౌలిక వసతుల కల్పన పూర్తయింది. ఇప్పటికే 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్స్‌లలో ఉత్పాదన ప్రారంభమైంది. అనంతపురం జిల్లాలోని రామగిరి, ముత్తువకుంట్ల గ్రామాల్లో 200 మెగావాట్ల సామర్ధ్యంతో నెలకొల్పుతున్న సోలార్, విండ్ హైబ్రీడ్ పార్క్‌కు సంబంధించి డీపీఆర్‌ను ఇంకా సమర్పించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం 690 ఎకరాల భూసేకరణ జరిగింది. పార్క్‌లో మౌలిక వసతుల కల్పన పనులు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు.