నేడు తొలి వన్డేలో విండీస్ తో తలపడడానికి ఇండియా సిద్ధమైంది. ఈ సారి కరీబియన్ గడ్డపై సవాలుకు సై అంటోంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న ధావన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
తొలి వన్డేలో టీమిండియా కూర్పు ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి జట్టులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌తో కలిసి ధావన్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. ఫామ్ అందుకోవడానికి ధావన్‌కు ఈ సిరీస్ ఓ చాన్స్‌గా మారనుంది. మరోవైపు రుతురాజ్, ఇషాన్ కూడా ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పోటీలో ఉన్నారు. షార్ట్‌పిచ్ బంతికి వికెట్ పారేసుకుంటున్న శ్రేయస్‌పై ఒత్తిడి ఉంది.
దీపక్ హుడా, సూర్యకుమార్ తుది జట్టులో ఉంటారు. శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నాడు. స్పిన్నర్లుగా చాహల్, జడేజా కొనసాగడం ఖాయం. టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో ఇవాళ జరగనుంది. మూడు వన్డేలకూ ఇక్కడి క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా నిలవనుంది.
టీమిండియా, వెస్టిండీస్ మధ్య 5 టీ20లు జరగనుండగా… చివరి రెండు మ్యాచ్ లు అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ సిరీస్‌లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో యువకులకు అవకాశం లభించనుంది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు హార్దిక్ పాండ్య స్థానంలో పేస్ ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |