ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే అన్నట్లుగా కుక్క తోక ఊపడానికి కూడా పలు కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మెదడులో సంతోషకరమైన భావనతోనే..మనుషులకైనా జంతువులకైనా మెదడులో రెండు భాగాలు ఉంటాయి. అందులో కుడిభాగం ఎడమవైపు సగం శరీరాన్ని, ఎడమ భాగం కుడివైపు సగం శరీరాన్ని నియంత్రిస్తుంటాయి. ఈ క్రమంలోనే శునకాలకు సంతోషకరమైన భావన కలిగినప్పుడు.. వాటి మెదడు ఎడమ భాగంలో సంతోషకరమైన అంశాలకు సంబంధించిన భాగం యాక్టివ్ గా మారుతున్నట్టు గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త యాంగ్ క్యూ ఝాంగ్ తెలిపారు. ఈ క్రమంలోనే శునకాలు తోక కుడివైపు ఎక్కువగా ఊపుతున్నట్టు గుర్తించామన్నారు.
ఒకవేళ ఆయా వ్యక్తులు నచ్చకపోయినా, భయపడినా శునకాలు తమ తోకలను ఎడమ వైపు ఎక్కువగా ఊపుతున్నట్టు గుర్తించామని తెలిపారు. కుక్క తోకపై పరిశోధన కదా అని ఏదో ఆషామాషీగా చేయలేదు. సుమారు 25 కుక్కల తోకలపై త్రీడీ మోషన్ సెన్సర్లు అమర్చి.. రోజూ కాసేపు కొత్త వారిని చూపిస్తూ, అదే సమయంలో వాటి మెదడును స్కాన్ చేస్తూ పరిశోధన నిర్వహించారు. ఈ క్రమంలో అన్ని శునకాలు, అన్ని రోజులు కలిపి మొత్తంగా 21 వేల సార్లు తోకలు ఊపడాన్ని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఐసైన్స్ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి.