మారుతున్న కాలంలో వింత పెళ్లిళ్లు..వింత వింత అలవాట్లు మనం చూస్తున్నాం. ఇదిలావుంటే నిన్నమొన్నటిదాకా ఎవరికీ తెలియని 24 ఏళ్ల క్షమాబిందు ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ గుజరాతీ అమ్మాయి తనను తాను పెళ్లాడి, భారత్ లో ఈ విధమైన వివాహం (సోలోగమీ) చేసుకున్న మొదటి యువతిగా చరిత్ర సృష్టించింది. ఎన్నో విమర్శలు ఎదురైనా, పెళ్లికి మంత్రాలు చదువుతానన్న పురోహితుడు వెనుకంజ వేసినా క్షమాబిందు తాను అనుకున్నది చేసి చూపించింది. జూన్ 8న వడోదరలోని తన నివాసంలో తనను తాను పెళ్లి చేసుకుంది.
ఇప్పుడామె హనీమూన్ కు సిద్ధమవుతోంది. ఆగస్టు 7న హనీమూన్ కు వెళుతున్నట్టు క్షమాబిందు వెల్లడించింది. ప్రముఖ పర్యాటక స్థలం గోవాను తన హనీమూన్ స్పాట్ గా ఎంచుకుంది. అక్కడ తన జీవితంలోని ప్రత్యేక క్షణాలను ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ లో బంధిస్తానని చెప్పింది. అందరి పెళ్లికూతుళ్ల లాగానే హనీమూన్ పట్ల తాను కూడా ఎంతో ఉద్వేగంతో ఉన్నానని క్షమాబిందు మీడియాకు తెలిపింది.