ఇది కోపం, అహం చూపే సమయం కాదు..టీఎంసీపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా తీవ్రంగా మండిపడ్డారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ సభ్యులు ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉంటారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడంలో విపక్షాల వైఖరి సరిగా లేకపోవడమే దీనికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మండిపడ్డారు. ఇది కోపం, అహం చూపే సమయం కాదని ఆమె అన్నారు. ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీఎంసీ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచిందని చెప్పారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. ఐక్యత కోసం పోరాడాల్సిన సమయం ఇదని చెప్పారు. మమతా బెనర్జీ ఇకనైనా విపక్షాలకు అండగా నిలుస్తారని భావిస్తున్నానని తెలిపారు.