ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో త్వరలోనే ఓ స్పష్టతరానున్నది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలకు తరలించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలనే ప్రతిపాదన కేంద్రానికి అందిందని తెలిపారు. కర్నూలుకు తరలింపుపై హైకోర్టుతో సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యానించారు. హైకోర్టు నిర్వహణ ఖర్చులన్నీ రాష్గ్ర ప్రభుత్వమే భరిస్తుందని హైకోర్టును కర్నూలుకు తరలించడంపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది అన్నారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కేంద్రానికి పంపాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
కర్నూలుకు హైకోర్టు తరలింపుపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం ఇచ్చారు. హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో.. ఏపీ ప్రభుత్వం కూడా ఆ దిశగా ఫోకస్ చేసే అవకాశం ఉంది. అయితే హైకోర్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రతిపాదనలు పంపాలని సూచించింది.
రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు. ఇక్కడ భవనం నిర్మించి హైకోర్టును ఏర్పాటు చేశారు.. కానీ జగన్ సర్కార్ మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో న్యాయ రాజధానిగా కర్నూలును నిర్ణయించింది.. హైకోర్టును కర్నూలకు తరలించాలని నిర్ణయం తీసుకుంది.. కానీ తరలింపుకు సిద్ధమైనా.. కొన్ని పిటిషన్ల కారణంగా ఆగింది.