గుంటూరుజిల్లాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి విడదల రజిని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసేవారు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని.. మంత్రి విడదల రజిని సూచించారు. బాపట్ల జిల్లా మార్టూరులోని 30 పడకల ప్రభుత్వ వైద్యశాలను విడదల రజిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రిజిస్టర్ లో సంతకాలు పెట్టిన సిబ్బందిని.. వాస్తవంగా విధుల్లో ఉన్న సిబ్బందిని మంత్రి రజిని తనిఖీ చేశారు. మెడికల్ స్టోరుకి వెళ్లి.. అక్కడున్న మందుల్ని పరిశీలించారు. ఆస్పత్రి మొత్తం కలియతిరిగారు. ఆస్పత్రిలోని పారిశుద్ధ్య సిబ్బంది పని తీరుపై మంత్రి రజిని సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందేలా పనిచేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే.. చర్యలు తప్పవని స్పష్టం చేశారు.నేరుగా రోగుల వద్దకు వెళ్లి.. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం బాగానే అందుతుందని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారు. రోగులు సంతృప్తి వ్యక్తం చేయడంపై మంత్రి రజిని వైద్యులను అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాగే పనిచేయాలని సూచించారు.