పరామర్శ కంటే ప్రచారానికే చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. "అసలు చంద్రబాబు వెళ్లింది దేనికి? వరద పర్యటనకా? ప్రచారానికా? పచ్చి అబద్ధాలను చెబుతూ వెళ్లారు అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు పర్యటనపై ఆయన స్పందించారు. వరద బాధితులకు ఎలాంటి సహాయం అందలేదని నిరూపించడమే ఆయన పర్యటన వెనుక ముఖ్య ఉద్దేశమని సజ్జల ఆరోపించారు. కానీ, తమకు సాయం అందలేదని ఏ ఒక్కరూ చెప్పలేదని వెల్లడించారు. దాంతో చంద్రబాబు చెప్పేది అబద్ధమని స్పష్టంగా తేలిపోయిందని అన్నారు.
చంద్రబాబు జీవితమే ఓ అబద్ధమైపోయింది. నాడు టీడీపీ హయాంలో విపత్తులు వస్తే ఒక్కసారైనా తక్షణ సాయంగా పైసా ఇచ్చాడా? చీపురు పట్టుకుని ఫొటోలకు పోజులివ్వడం తప్ప ఏమీ చేయలేదు. మీడియాలో కనిపించాలన్న యావ చంద్రబాబును ఈ విధంగా తయారుచేసింది. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని ఇవాళ ప్రజలెవరూ నమ్మడంలేదు" అంటూ సజ్జల విమర్శనాస్త్రాలు సంధించారు.