కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు ఆఫ్రికన్ దేశమైన ఇథియోపియా ఆర్బీకే తరహా సేవలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని కోరింది. ఆ దేశం వచ్చే పదేళ్లలో ఏటా 6.2 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ఉంది. ఇందుకోసం రైతుల్లో నైపుణ్యం పెంపు, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, దిగుబడుల నాణ్యతపై దృష్టి పెట్టింది. ఆ దేశ అభ్యర్థన మేరకు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య నేతృత్వంలో జాతీయ స్థాయి బృందం ఇథియోపియా వెళ్తోంది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, భారత్‌లోని వరల్డ్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు, తమిళనాడు వ్యవసాయ వర్సిటీ వీసీ సభ్యులుగా ఉంటారు.
ఈ బృందం 25వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తుంది. అక్కడి వ్యవసాయ పరిస్థితులు, సాగు పద్ధతులు, రైతుల సమస్యలు, సాగుకు అనుకూలమైన భూముల విస్తీర్ణం, సాగవుతున్న పంటలు, పెట్టుబడి వ్యయం, ఉత్పత్తి, ఉత్పాదకత, సాగు ఉత్పాదకాలు రైతులకు అందుతున్న తీరును పరిశీలిస్తుంది. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు అందించాల్సిన తోడ్పాటుపై అధ్యయనం చేస్తుంది. అక్కడ జరుగుతున్న పరిశోధనలు, వాటి ఫలితాలు గ్రామస్థాయిలో అందుతున్న తీరును పరిశీలిస్తుంది.