ఉత్తరాదిలో నాలుగైదు రోజులుగా ఉన్న రుతుపవన ద్రోణి.. తూర్పు భాగం శనివారం దక్షిణాది వైపు మళ్లింది. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో శనివారం కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో భారీగా వానలు పడ్డాయి. రానున్న 24గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని.. కోస్తాలో అక్కడక్కడా భారీగా వానలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడా 2, 3 రోజుల్లో వర్షాలు పెరుగుతాయంటున్నారు.
ఏలూరు జిల్లా పోలవరంలో గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి తగ్గింది. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.540 మీటర్లకు.. దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 23.91 మీటర్లకు తగ్గింది. ఎగువ నుంచి వస్తున్న 6,71,982 క్యూసెక్కులను అధికారులు దిగువకు విడుదల చేశారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం తగ్గింది. దీంతో డ్యాం ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 882.10 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు 199.7354 టీఎంసీలుగా ఉంది.