మోచేతి సమస్య ఉన్నప్పటికీ... అద్భుత ప్రదర్శన చేస్తూ జావెలిన్ ను 86 మీటర్ల దూరం విసరడం చాలా గొప్ప విషయమని అర్షద్ ను ప్రశంసించాను' అని ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ మెడల్ విజేత నీరజ్ చోప్రా వెల్లడించాడు. ఇండియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నిన్న అరుదైన ఘనతను సాధించారు. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో మెడల్ సాధించిన రెండో భారత క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించారు. 2003 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో అంజూ బాబీ జార్జ్ మెడల్ సాధించింది. ఆ తర్వాత ఇండియా తరఫున నీరజ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్స్ లో 88.13 మీటర్లు విసిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
మరోవైపు మెడల్ గెలుపొందిన తర్వాత ఆయన మాట్లాడుతూ పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ పై ప్రశంసలు కురిపించాడు. 'పోటీ ముగిసిన తర్వాత నేను అర్షద్ తో మాట్లాడాను. కాంపిటీషన్ లో నీ ప్రదర్శన చాలా బాగుందని అర్షద్ కు నేను చెప్పాను. మోచేతి ఇబ్బందితో బాధ పడ్డానని ఆయన నాతో చెప్పాడు. మోచేతి సమస్య ఉన్నప్పటికీ... అద్భుత ప్రదర్శన చేస్తూ జావెలిన్ ను 86 మీటర్ల దూరం విసరడం చాలా గొప్ప విషయమని అర్షద్ ను ప్రశంసించాను' అని చెప్పాడు.
వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. 2018లో జకార్తాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో వీరు అందరి దృష్టిని ఆకర్షించారు. పోడియంలో వీరిద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటున్న ఫొటో అప్పట్లో వైరల్ అయింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో నాలుగో త్రో సందర్భంగా తన తొడలో చాలా ఇబ్బంది అనిపించిందని నీరజ్ చెప్పాడు. తొడ ఇబ్బంది లేకపోతే మరింత దూరం విసిరేవాడినని తెలిపాడు.