రిటైర్మెంట్ కు స్వస్తి పలికే యోచనలో మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చేసిన రిటైర్మెంట్ ప్రకటనకు కట్టుబడి ఉండాలని భావించడంలేదని మిథాలీ పేర్కొంది. కారణం ఏమిటో తెలుసా...? వచ్చే ఏడాది ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిథాలీ రాజ్ మహిళల ఐపీఎల్ పై ఆసక్తి చూపుతోంది. 2023లో జరిగే మొట్టమొదటి పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్ లో ఆడాలన్న తన మనసులో మాటను వెల్లడించింది. ఈ క్రమంలో, తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకునే అవకాశాలున్నాయంటూ సంకేతాలిచ్చింది.
మహిళల ఐపీఎల్ కు ఇంకా కొన్ని నెలల సమయం ఉందని, అయితే, తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. మహిళల ఐపీఎల్ మొట్టమొదటి ఎడిషన్ లో పాల్గొనడం ఎంతో బాగుంటుందని పేర్కొంది. ఐసీసీ నిర్వహించిన 100 పర్సెంట్ క్రికెట్ అనే పోడ్ కాస్ట్ తొలి ఎపిసోడ్ లో మాట్లాడుతూ మిథాలీ పైవ్యాఖ్యలు చేసింది. ఇటీవల మిథాలీ అన్ని ఫార్మాట్లలోనూ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం తెలిసిందే. 39 ఏళ్ల మిథాలీ రాజ్ 232 వన్డేలు ఆడి 50కి పైగా సగటుతో 7,805 పరుగులు చేసింది. 12 టెస్టుల్లో 699 పరుగులు చేయగా, 89 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడి 2,364 పరుగులు సాధించింది.