రాష్ట్ర అప్పులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏకరువు పెట్టే కథనాలు, వాటి ఆధారంగా టీడీపీ బృందం చేస్తున్న ప్రచారం అంతా పచ్చి బూటకమని వైసీపీ నాయకులూ తెలియజేసారు. అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం పలుదఫాలు వాస్తవాలను గణాంకాలతో సహా వివరించినా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మసకబార్చేందుకు ప్రయత్నిస్తున్న అభివృద్ధి నిరోధక శక్తులకు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానం చెంపపెట్టులా పరిణమించింది అని అన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల అప్పుల భారంపై హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ కిషన్‌కపూర్ అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఆ వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 2022 మార్చి నాటికి బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.3,98,903.60 కోట్లేనని తేలింది. చంద్రబాబు సర్కారు దిగిపోయే నాటికి అంటే 2019 మే నెలాఖరు నాటికి రాష్ట్రం అప్పులు రూ.2,68,115.00 కోట్లుగా ఉన్నాయి. అంటే మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.1,30,788.6 కోట్లు మాత్రమే అప్పులు చేసినట్లు స్పష్టమైంది. అప్పుల్లో ఏపీ దేశంలోనే నంబర్ వన్ అంటూ దుష్ట చతుష్టయం చేస్తున్న దుర్మార్గమైన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనే స్పష్టం చేస్తోంది అని తెలియజేసారు.