అతిగా నిద్రపోయిన వారికి గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక మనిషికి రోజుకి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. అంతకన్నా తక్కువసేపు నిద్రపోయేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం 34 శాతం ఉన్నట్టు నిపుణులు తేల్చారు. అలాగే ఎనిమిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయేవాళ్లలో 35 శాతం గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్టు పరిశోధనలో తేలింది. అతి నిద్ర మూలంగా డీఎన్‌ఏ సైతం మారుతున్నట్టు వెల్లడైంది. తొమ్మిది గంటల కన్నా ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో డిప్రెషన్ వచ్చే లక్షణాలు కూడా బయటపడ్డాయి. అలాగే ఏడుకన్నా తక్కువ గంటలు నిద్రపోయే వారిలోనూ ఈ లక్షణాలు కనిపించాయి. కనుక రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం ఉత్తమం. అప్పుడప్పుడు తొమ్మిది గంటలు దాటినా ఫర్వాలేదు కానీ రోజూ అతినిద్ర అలవాటు లేకపోవడమే మంచిది. అయితే ఓ పరిశోధన ప్రకారం అత్యధిక గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిని పరిశీలిస్తే అందులో 80 శాతానికి పైగా రోజు 9 గంటలకు పైగా నిద్రించేవారేనట. మరో విషయం ఏంటంటే నిద్ర తక్కువున్నా ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు మెండు. ముందే జాగ్రత్త.. నిద్ర మంచిదే కానీ, అతి నిద్రే ప్రమాదకరం.