అసంపూర్తిగా మిగిలి ఉన్న సిమెంటు రోడ్డును పూర్తి చేసిన పిదపే తాను ఓట్లను అభ్యర్థిస్తానని స్థానిక ఎమ్మెల్యే డా. మూలె సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. పురపాలిక పరిధిలోని 6, 7 కౌన్సిల్ వార్డుల పరిధిలో ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ మూలె హర్షవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు తమ్మిశెట్టి బాలయ్యతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కడప రోడ్డులోని బజాజ్ షోరూం ప్రాంతంలో అక్కడి ప్రజలు అసంపూర్తిగానిలిచి ఉన్న సిమెంటు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రోడ్డు ఏర్పాటుకు తప్పక చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తూ రోడ్డు పనులు పూర్తి చేస్తేనే తాను తమరిని ఓట్లు అడగడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఆయా వార్డుల పరిధిలో కాలినడకన పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. పేరుపేరున ఆప్యాయంగా పలుకరిస్తూ కలియతిరిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సావధానంగా ఆలకిస్తూ పరిష్కారందిశగా చర్యలకు చొరవ చూపడం విశేషం. నాయకులకు బాణాసంచా పేలుళ్లు, పూలమాలలతో ఘనస్వాగతం లభించింది. పలువురు పార్టీ శ్రేణులు తేనేటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ జగన్నాధ్, ఏఈ సురేష్ బాబు, ఆ గంగిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ మధుకుమార్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డుల ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.