హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉమ్మడి కడప జిల్లా నుంచి వచ్చిన జనసేన నాయకులు, జన సైనికులతో నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “జనసేన పార్టీకి కడప జిల్లాలో బలంగా పనిచేసే జన సైనికులున్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఉండే ప్రాంతంలో ఓ గొప్ప ఆశయం కోసం మనం పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. జనసైనికులకు ఏ కష్టమొచ్చినా పార్టీ కచ్చితంగా అండగా నిలుస్తుంది. గత మూడేళ్లలో సీఎం సొంత జిల్లాలో 132 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం సాధారణ విషయం కాదు. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ గత మూడేళ్లలో అనేక మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. వారికి తగిన సాయం అందించాల్సిన అవసరం ఉంది. కేవలం పార్టీ నుంచి సాయం చేయడమే కాదు.. ప్రభుత్వం నుంచి సదరు కౌలు రైతులకు న్యాయంగా రావల్సిన రూ.7 లక్షలు వచ్చే వరకు జన సైనికులు పోరాడాల్సిన అవసరం ఉంది. రైతు కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా మేమున్నామని భరోసా నింపాలి అని తెలియజేసారు.