ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడిని గుడిని ప్రేమించే వారెవ్వరూ వైసీపీకి ఓటేయరు: ఎంపీ రఘురామ కృష్ణరాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 27, 2022, 08:51 PM

రాష్ట్రంలో బడిని గుడిని ప్రేమించే వారు ఎవరూ రానున్న ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయరని ఆ పార్టీ రెబల్ ఎంపీ, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు రఘురామ. బడిని గుడిని ప్రేమించనివారంటూ ఎవరూ ఉండరని పేర్కొన్నారు. రాష్ట్రంలో బడులను మూసివేసి, బార్లను తెరుస్తున్నారని.. ఇప్పటికే 875 బార్ల ప్రారంభానికి అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. 8000 బడులను విలీన ప్రక్రియ పేరిట మూసివేసిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బడులను ప్రేమించేవారు అధికారంలోకి వస్తారని.. వారు తిరిగి ఆ బడులను ప్రారంభిస్తారని అన్నారు. తరగతుల విలీనం అంటే బడుల విలీనమా అని ప్రశ్నించారు. బడుల మూసివేతను ప్రశ్నించకూడదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారని.. ఎందుకు ప్రశ్నించకూడదో చెప్పాలన్నారు. ఈరోజు బడులను విలీనం చేసినట్లే, రేపు ఆంధ్ర యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీలను కలిపేశామంటారని ఎద్దేవా చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ అప్పులు అన్నీ కలుపుకుని రూ.8 లక్షల 30వేల కోట్లుకు చేరుకొన్నాయని  పేర్కొన్నారు. ఏపీ అప్పుల గురించి పార్లమెంట్లో చెప్పింది ఒకటైతే అనుకూల మీడియాలో రాసింది మరొకటి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వఅప్పుల గురించి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో రూ.3 లక్షల 98 వేల కోట్లని పేర్కొన్నారని, అయితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పొందిన రుణాల గురించి ప్రస్తావించలేదన్నారు. మార్చి 28న తాను ప్రధానమంత్రికి రాసిన లేఖలో పొందుపరిచిన.. 2022-23వ ఆర్థిక వార్షిక సంవత్సర, ప్రభుత్వ బడ్జెట్ వ్యాల్యూమ్ అరు, కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.4 లక్షల 13 వేల కోట్లని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు మూడు లక్షల 98 వేల కోట్లుగా పార్లమెంటులో పేర్కొన్న దానికి.. గతేడాది అప్పులు చేసి కూడా లెక్కలు చూపించకుండా ఉన్న మొత్తం అప్పులు రూ.నాలుగు లక్షల 13వేల కోట్లని వెల్లడించారు.


ఇక కార్పొరేషన్ పేరిట చేసిన అప్పులు రూ.1 లక్ష 38 వేల కోట్లని.. ఇది కాక ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ పేరిట రూ.10వేల కోట్ల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందిందన్నారు. ప్రభుత్వం నాన్ గ్యారెంటీతో, ఇతర కార్పొరేషన్లు పొందిన అప్పురూ. 87 వేల కోట్లన్నారు రఘురామ కృష్ణరాజు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 50వేల కోట్ల బకాయిలను చెల్లించవలసి ఉన్నది అన్నారు. గత ఏడాది మార్చి నాటికి రూ.7 లక్షల 98 వేల కోట్ల పైచిలుకు అప్పులుంటే.. ఇటీవల రూ.38 వేల కోట్లు అప్పులుగా ఎత్తారని గుర్తు చేశారు. ఇందులో రూ.8 వేల కోట్లు మద్యం బాండ్ల రూపంలో సేకరిస్తే.. రూ.30 వేల కోట్లు ఆర్బీఐ నుంచి రుణంగా పొందారన్నారు. అప్పుచేసి పప్పుకూడు సినిమాలో సీఎస్‌ఆర్ తరహాలో తమ ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పుల గురించి ఢిల్లీలో చర్చకు ఎక్కడైనా తాను సిద్ధమేనని.. ఎవరు వస్తారో రావాలని సవాల్ చేశారు.


కోస్తాంధ్రలో జగనన్న కాలనీలన్నీ జలకళ సంతరించుకున్నాయని సెటైర్లు పేల్చారు ఎంపీ. జగనన్న కాలనీల నిర్మిస్తామని చెప్పిన ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలేనన్నారు. 30 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టి.. ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు ఇస్తామని చెప్పారన్నారు. కానీ ఇళ్ళ నిర్మాణం ఎక్కడా పునాదులు దాటి పైకి లేవ లేదన్నారు. 16 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని నిర్మిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మాటలే తప్పితే... చేతల్లో చూపించడం లేదని, చేతల్లో చూపించేలా సద్బుద్ధిని పాలకులకు భగవంతుడు ప్రసాదించాలని రఘురామకృష్ణ రాజు కోరారు.


వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక టీవీ నవ్వు విసిరారని సెటైర్లు పేల్చారు. ఒక బాలుడు వెళ్లి పెన్ను అడిగితే, ఆ పెన్ను ఇచ్చిన దానికి 20 నిమిషాల పాటు సాక్షి ఛానల్ లో స్క్రోలింగ్ వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి.. అధికారులను, బాధితులను పిలిచి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఐదు రోజుల క్రితమే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వరద బాధితులను పరామర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014లో వరద బాధితులను పరామర్శించేందుకు కారు దిగి పరిగెత్తి పొలాల్లోకి వెళ్లిన స్ఫూర్తి, ఇప్పుడు వరద బాధితులను పరామర్శించడంలో ఏమయిందో చెప్పాలని ప్రశ్నించారు.


చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవత్వం ఉందని.. అందుకే తనకు ఎదురైన కష్టానికి స్పందించి ఓదార్పు మాటలు మాట్లాడారని రఘురామకృష్ణ రాజు అన్నారు. తాను ఇంకా వైఎస్సార్‌సీపీలోనే పార్టీలోనే కొనసాగుతున్నానని.. పార్టీలో ఉన్న తనని ఏనాడైనా ఏమి జరిగిందని ఒక్కసారి అయినా అడిగారా అంటూ ప్రశ్నించారు. తాను చంద్రబాబు గురించి మంచి మాట్లాడితే ఆయనకు మద్దతిస్తున్నానని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించిన చంద్రబాబు నాయుడు అన్నా.. ఆలస్యమైనా స్పందించిన పవన్ కళ్యాణ్ గారన్నా తనకు ఎంతో గౌరవమని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa