పులివెందుల నియోజకవర్గ చక్రాయపేట మండలం మారెళ్ల మడక పంచాయతీ పరిధిలో వెలసిన గండిక్షేత్రం శ్రావణ మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 27వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలను నిర్వహించేందుకు దేవదాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాలకు సంబంధించిన గోడపత్రాలను కూడా ఈఓ ముకుందరెడ్డి, చైర్మన్ రాఘవేంద్రప్రసాద్ లు విడుదల చేశారు. ఏటా శ్రావణమాసంలో వీరంజనేయస్వామి ఉత్సవాలు నిర్వ హించడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారీ తిష్టవే యడంతో ఉత్సవాలకు అంతరాయం కలిగింది.
లాక్డౌన్ నేపధ్యంలో భక్తులు బయట నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. కానీ ఈ దఫా కరోనా నిబంధనలు లేనట్లు తెలుస్తోంది. ఈ దఫా ఐదు శనివారాలు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ నెల 30వ తేదీన తొలి శ్రావణ శనివారం ప్రారంభమవుతుంది, అనతరం ఆగస్టు 6, 13, 20, 27 వ తేదీలను శ్రావణ శనివారాలుగా దేవాదాయశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ఈవో ముకుందరెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసాలల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. పాపాఘ్ని ప్రవహించడం వల్ల కొంత వరకు స్నానఘట్టాల సమస్య తీరుతుందన్నారు. ఇక మహిళలకు ప్రత్యేక స్నానఘట్టాలను ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై వీరాంజనేయస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.