మనకు పాము ఎదురుపడితే పరుగులు తీస్తాం. కానీ కదులుతున్న రైలులో అదే పాము కనిపిస్తే ఏం చేస్తే...చేసేది ఏమీలేక హడలిపోతాం. తిరువనంతపురం నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో పాము కనిపించడంతో ప్రయాణికులు భయంతో బెంబేలెత్తిపోయారు. పామును పట్టుకునేందుకు రైలును దాదాపు గంటపాటు నిలిపివేశారు. కేరళలోని కోజికోడ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. రైలు తిరూర్ నుంచి బయలుదేరిన కాసేపటికే ఎస్ 5 బోగీలో బెర్త్ కింద లగేజీ మధ్యలో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలిపోయారు. వెంటనే ఆ విషయాన్ని టీసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తర్వాతి స్టేషన్ అయిన కోజికోడ్‌లో రైలును నిలిపివేశారు.
స్టేషన్‌లో రైలు ఆగగానే ప్రయాణికులు కిందికి దిగిపోయారు. పాములు పట్టే వారితో బోగీని వెతికించారు. గంటపాటు వెతికినా దాని జాడ కనిపించకపోవడంతో అది బయటకు వెళ్లిపోయి ఉంటుందని నిర్ధారించారు. కొందరు ప్రయాణికులు తమ ఫోన్లలో తీసిన పాము ఫొటోలను పరిశీలించి అది విషపూరిత సర్పం కాదన్న నిర్ణయానికి వచ్చారు. పాము ఓ రంధ్రం గుండా బయటకు వెళ్లిపోయి ఉండొచ్చని భావించిన అధికారులు దానిని మూసివేశారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.