కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ధరల పెరుగుదల అంశంపై విపక్ష సభ్యులు ప్రతిరోజూ ఉభయ సభల్లో కేంద్రాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటివరకు 24 మంది ఎంపీలపై పార్లమెంటులో సస్పెన్షన్ విధించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ విపక్షాల ఎంపీలు ధర్నా చేపట్టారు. వారికి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు అనుమతించారు. అయితే వర్షం పడడంతో పార్లమెంటు ప్రవేశద్వారం వద్ద దోమతెరలు వేసుకుని నిద్రించారు. వారికి డీఎంకే సభ్యులు మధ్యాహ్నభోజనం సందర్భంగా ఇడ్లీలు సరఫరా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బెంగాల్ సంప్రదాయం ప్రకారం చేపల వేపుడు వడ్డించగా, టీఆర్ఎస్ పార్టీ రాత్రి భోజనం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.