ఇటీవల పతనానికి గురవుతూ వచ్చిన మనదేశ రూపాయి తాజాగా కాస్తబలపడింది. ఇటీవలి కాలంలో చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి విలువ క్రమంగా బలపడుతూ వస్తోంది. గురువారం కాస్త రికవరీ అయిన రూపాయి.. శుక్రవారం ఏకంగా 45 పైసలు బలపడింది. డాలర్ తో మారకంలో రూ.79.24 పైసలకు చేరింది. దేశీయంగా బలపడిన సెంటిమెంట్ స్టాక్ మార్కెట్లలో భారీగా సాగిన కొనుగోళ్లు రూపాయికి మద్దతు ఇచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫారిన్ ఎక్స్చేంజీ మార్కెట్లో గురువారం డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.69 పైసల వద్ద ముగియగా.. శుక్రవారం ఉదయం గట్టి మద్దతుతో రూ.79.55 పైసల వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఒక దశలో రూ.79.17 పైసల వరకు కూడా బలపడినా.. చివరికి 45 పైసల లాభంతో రూ.79.24 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడం, దేశీయంగా స్టాక్ మార్కెట్లు బలపడటం కూడా రూపాయికి మద్దతును ఇచ్చాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. మరోవైపు చమురు ధర 2.28 శాతం పెరిగి బ్యారెల్ కు 109.58 డాలర్లకు చేరింది. అందువల్ల రూపాయి మరింత పెరగకుండా ఆగిందని నిపుణులు చెబుతున్నారు.