రాజధాని నిర్మాణానికి కేంద్రం ఎందుకు చొరవ చూపడంలేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ను అమరావతికి చెందిన రైతులు నిలదీశారు. రాజధానిలో నిర్మాణ పనులు జరిగినా, అసలేమీ జరగలేదన్నట్టు ఎందుకు మాట్లాడారని నిలదీశారు. రాజధానిలో రైతులకు ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేపీ 'మనం-మన అమరావతి' పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. రాజధాని ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రైతులతో మాట్లాడారు. అయితే, పెనుమాక వద్ద అమరావతి రైతులు ఆయనను నిలదీశారు.
అందుకు సోము వీర్రాజు బదులిస్తూ, సంవత్సరంలోపు ప్లాట్లు వస్తాయని, రెండేళ్లలో రాజధాని కడతామని అన్నారు. ఆపై, మీరందరూ బీజేపీకి ఓటేయండి అంటూ అక్కడ్నించి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలో ఓ వృద్ధరైతు సోము వీర్రాజును అడ్డుకున్నాడు. ఆయన నుంచి సోము వీర్రాజుకు ఊహించని స్పందన ఎదురైంది.
"మీరు, జగను ఒకటే... మీరు, జగను తోడుదొంగలై రాజధానిని ఇట్టా చేశారు" అంటూ ఆ వృద్ధుడు ఆక్రోశం వ్యక్తం చేశాడు. దాంతో సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేస్తూ, "ఐదేళ్ల పాటు రాజధానిని కట్టకుండా ఉన్నవారిని అడగాలి మీరు!" అంటూ అక్కడ్నించి నిష్క్రమించారు. ఆ వృద్ధుడు మాట్లాడుతున్న సమయంలో అక్కడున్న రైతులు 'జై అమరావతి' నినాదాలు చేశారు.