దేశంలో మంకీపాక్స్ వైరస్ విస్తరణ కలకలం రేపుతుంటే మరోవైపు అదే మంకీపాక్స్ తో తొలి మరణం నమోదైంది. కేరళలోని త్రిసూరులో 22 ఏళ్ల యువకుడు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. పున్నియూర్‌కు చెందిన యువకుడు ప్రయివేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంకీపాక్స్ కారణంగా మరణించాడు. అతడి శాంపిళ్లను ఆరోగ్య శాఖ అధికారులు అలప్పుజలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. కానీ అతడికి యూఏఈలో మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. జూలై 22న అతడు కేరళ వచ్చాడని తెలుస్తోంది. మెదడువాపు వ్యాధి, అలసటతో అతడు ప్రయివేట్ హాస్పిటల్‌లో చేరగా.. అతడి కుటుంబీకులు శనివారం మంకీపాక్స్ టెస్ట్ రిజల్ట్‌ను హాస్పిటల్‌కు సమర్పించారు. మంకీపాక్స్ సోకిందనే విషయం వైద్యులకు ఆలస్యంగా అందించడం కూడా అతడి మరణానికి కారణంగా భావిస్తున్నారు. ఆఫ్రికా వెలుపల నమోదైన నాలుగో మంకీపాక్స్ మరణం ఇది కావడం గమనార్హం.
కేరళలో మంకీపాక్స్ మరణం నమోదు కావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీపాక్స్ లక్షణాలతో యువకుడు చనిపోయిన విషయమై హై లెవల్ కమిటీతో విచారణ జరిపిస్తామని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి ప్రకటించారు. చవక్కాడ్ కురంజియార్‌లో ఆ యువకుడు మరణించాడని.. అతడికి విదేశాల్లోనే పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని.. త్రిసూరులో అతడు చికిత్స పొందాడని ఆరోగ్య మంత్రి తెలిపారు. వైద్య చికిత్స ఎందుకు ఆలస్యమైందనే విషయమై విచారణ జరుపుతామని వీణా జార్జి తెలిపారు. మరణించిన యువకుడితో కాంటాక్ట్ అయిన వారి వివరాలను ఆరా తీస్తున్నామన్నారు. కాగా మంకీపాక్స్‌తో మరణించిన యువకుడు.. కేరళకు తిరిగొచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆటలాడాడని ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకూ మన దేశంలో 4 మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అందులో మూడు కేసులు కేరళలోనే నమోదయ్యాయి. మే నెల నుంచి ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో ఇప్పటి వరకూ 21 వేలకుపైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికాలో 75 మంకీపాక్స్ అనుమానిత మరణాలు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా నైజీరియా, కాంగో దేశాల్లోనే నమోదయ్యాయి. ఇటీవలి కాలంలో పశ్చిమ దేశాల్లో ముఖ్యంగా యూరప్ దేశాల్లో మంకీపాక్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. స్పెయిన్, బ్రెజిల్ దేశాల్లో మంకీపాక్స్ సంబంధిత మరణాలు నమోదయ్యాయి. గత వారమే ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. మంకీపాక్స్‌ను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు కలిసి పని చేయాలని.. లైంగిక సంబంధాల విషయంలో సయంమనం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో ప్రజలకు పిలుపునిచ్చింది.