ప్రేమ ఎపుడు పుడుతుందో...ఎక్కడ పుడుతుందో చెప్పలేమన్నది జగమెరిగిన సత్యం. అలాంటి ఘటనే ఇటీవల పాకిస్తాన్ లో చోటు చేసుకొంది. ఆమె పేరు నజియా. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో ఉంటుంది. డబ్బు బాగానే ఉంది. కానీ ఒంటరిగా ఉంటోంది. ఇంటి పనుల్లో సాయం కోసం కొంత కాలం క్రితం ఓ వ్యక్తిని నెలకు రూ.18 వేల జీతానికి నియమించుకుంది. అతడి పేరు సుఫియాన్. చాలా సింపుల్ గా ఉంటాడు. చెడు అలవాట్లేమీ లేవు. ఇంట్లో అన్ని పనులు బాగా చేస్తూ వచ్చాడు. తన సొంత ఇల్లు, సొంత మనిషి అన్నంత బాగా చూసుకున్నాడు.
ఇదంతా చూసి ఆ ఇంటి యజమాని అయిన నజియా.. అతడిపై మనసు పారేసుకుంది. పనివాడు కదా అన్న ఆలోచనను వదిలేసింది. సుఫియాన్ ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అతను మొదట షాక్ లోకి వెళ్లిపోయినా.. నజియా అంటే తనకూ చాలా ఇష్టమని చెప్పేశాడు. ఇంకేం.. ఇద్దరికీ అంగీకారం కుదిరింది. పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో పని కోసం వచ్చినవాడు.. ఇప్పుడు ఇంటి యజమానురాలికి భర్త అయ్యాడు.
నజియా, సుఫియాన్ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. సుఫియాన్ తన 'సల్మాన్ ఖాన్' అని చెబుతూ నజియా మురిసిపోతే.. నజియా తన 'కత్రినా కైఫ్' అంటూ సుఫియాన్ సంబరపడుతున్నాడు. పాకిస్థాన్ కు చెందిన ఓ యూట్యూబ్ చానల్ కంటెంట్ క్రియేటర్ నజియాను ఇంటర్వ్యూ చేశాడు. ‘‘నేను ప్రేమిస్తున్న విషయం చెప్పగానే సుఫియాన్ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినంత షాక్ లోకి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత తాను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు” అని నజియా తెలిపింది.తాను అనారోగ్యం పాలైనప్పుడు దగ్గరుండి అన్ని సేవలు చేశాడని.. వంట చేసి పెట్టడం, మందులివ్వడం వంటివన్నీ చేస్తూ సొంత మనిషి కంటే బాగా చూసుకున్నాడని ఆమె పేర్కొంది. తాను నజియాకు భర్త అయినా.. ఇప్పటికీ, ఎప్పటికీ ఆమెకు సేవ చేస్తూనే ఉంటానని, బాగా చూసుకుంటానని సుఫియాన్ చెబుతున్నాడు. మొత్తానికి ప్రేమకు పేద, ధనిక భేదం లేదని చాటిచెబుతోంది ఈ జంట!