మంచివారైనా...చెడ్డవారైనా సరే ప్రముఖుల వస్తువులు వేలంలో కొట్ట రూపాయలు పలుకుతాయి. యూదు జాతి వినాశకారిగా పేరొందిన నాజీ పార్టీ వ్యవస్థాపకుడు అడాల్ఫ్ హిట్లర్ చేతి గడియారం తాజాగా నిర్వహించిన ఓ వేలంలో కోట్ల రూపాయల్లో పలికింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో హిట్లర్ వాచ్‌ని వేలం వేశారు. ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 కోట్ల 71 లక్షల రూపాయలు పలికినట్లు వేలం అధికారులు స్పష్టం చేశారు. హుబర్ కంపెనీకి చెందిన ఈ గడియారాన్ని యురోపియన్‌కు చెందిన ఒక అజ్ఞాతవాసి కొనుగోలు చేశాడు.
గడియారంపై స్వస్తిక్ గుర్తుతో పాటు ఏ.హెచ్.ఖుదా.. అంటే అడాల్ఫ్ హిట్లర్ అని రాసి ఉంది. ఈ వేలాన్ని అమెరికా సహా ఇజ్రాయెల్‌లోని యూదు నాయకులు ఖండించారు. వేలాన్ని ఖండించడంపై వేలం సంస్థ స్పందిస్తూ చరిత్ర కాపడటమే తమ ఉద్దేశమని పేర్కొంది. చరిత్ర మంచిదైనా.. చెడ్డదైనా.. దానిని భధ్రపరచాలని, చరిత్రను నాశనం చేస్తే ఎలాంటి ఆధారాలు మిగలవు అంటూ అక్కడ ఉన్న ఒక సీనియర్ అధికారి చెప్పారు.
ఈ గడియారాన్ని బహుశా ఏప్రిల్ 20, 1933న హిట్లర్ 44వ జన్మదినోత్సవం సందర్భంగా బహుమతిగా ఇచ్చి ఉండొచ్చని అలెగ్జాండర్ హిస్టారికల్ వేలం సంస్థ అభిప్రాయ పడుతోంది. ఆ సమయంలో హిట్లర్ జర్మన్ నియంతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 30 మంది ఫ్రెంచ్ సైనికులు హిట్లర్ ఇంటి బెర్గోఫ్‌పై దాడి చేసినప్పుడు ఆ గడియారాన్ని స్మారక చిహ్నంగా తీసుకున్నట్లు వేలం సంస్థ అంచనా వేస్తోంది. అప్పటి నుంచి ఈ గడియారాన్ని అనేక తరాలు కొనుగోలు చేస్తూ విక్రయిస్తూ వస్తున్నాయి.
హిట్లర్‌కు సంబంధించిన ఇతర వస్తువులను కూడా ఈ వేలంలో ఉంచారు. అందులో నాజీ అధికారులు సంతకం చేసిన ఫోటోతో పాటు అతని భార్య ఎవా బ్రాన్ దుస్తులు కూడా ఉన్నాయి. వేలంలో పసుపు గుడ్డ కూడా ఉంది, దానిపై నక్షత్రంతో జూడ్ అని రాసి ఉంది.. అంటే జర్మన్ భాషలో యూదు. హోలోకాస్ట్ సమయంలో యూదు ప్రజలను గుర్తించబడటానికి పసుపు వస్త్రాలు లేదా బ్యాండ్‌లను ధరించమని బలవంతం చేశారు. అయితే, ఈ వేలాన్ని ఆపాలంటూ 34 యూదు నాయకులు బహిరంగ లేఖ రాశారు.