అనైతిక సంబంధాలు ఎప్పటికైనా వినాశనానికేనని అందరికీ తెలుసు. తాజాగా అలాంటి ఘటనే పాకిస్తాన్ దేశంలో చోటు చేసుకొంది. తన భార్యను బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ పోలీస్ కానిస్టేబుల్‌కు ముక్కు, చెవులు, పెదవులు కోసేశాడు ఓ వ్యక్తి. కానిస్టేబుల్‌ను తన స్నేహితుల సాయంతో అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఒళ్లు గగ్గుర్పాటుకు గురిచేసే ఈ ఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సుల్లో ఆదివారం చోటుచేసుకుంది. లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగ్ జిల్లాలో జరిగిన ఈ ఉదంతం జరిగినట్టు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ ఖాసిమ్ హయత్‌ను మొహమ్మద్ ఇఫ్తికార్ తన సహచరులతో కలిసి అపహరించి చిత్రహింసలకు గురిచేశాడు. హయత్ ముక్కు, చెవులు, పెదవులను పదునైన ఆయుధంతో కోసేశాడని పోలీసులు తెలిపారు.
తన భార్యతో హయత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అనుమానించిన ఇఫ్తికార్.. మరో 12 మందితో కలిసి ఆదివారం ఉదయం కానిస్టేబుల్‌ను కిడ్నాప్ చేశాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఓ కత్తితో శరీర భాగాలను కత్తిరించాడని పోలీస్ అధికారి చెప్పారు. తీవ్ర గాయాలతో ఉన్న ఖాసిమ్ హయత్‌ను చికిత్స కోసం జంగ్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించామని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నిందితుడు ఇఫ్తికార్.. గత నెలలోనే హయత్‌పై ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.
తన కుమారుడ్ని చంపుతానని బెదిరించి నా భార్యతో బలవంతంగా హయత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించాడు. అంతేకాదు, బెదిరింపులకు గురిచేసి లొంగదీసుకున్న కానిస్టేబుల్ హయత్.. భార్యకు తెలియకుండా వీడియో తీశాడని, దీనిని అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో ఆరోపణలు చేశాడు. ఈ ఫిర్యాదు చేసిన కొద్ది రోజుల్లోనే కానిస్టేబుల్‌పై ఇఫ్తికార్ దాడికి దిగడం గమనార్హం. కాగా, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు, అతడి సహచరుల కోసం గాలిస్తున్నారు.