అత్యంతవేగంతో దూసుకొచ్చే 5జీ ఇంటర్నేట్ సేవలు మన దేశంలో ఎపుడూ అన్న ఆసక్తి ప్రజల్లో నెలకొంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు అక్టోబర్ నుంచి మొదలు కానున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణె, జామ్ నగర్, హైదరాబాద్ తదితర పట్టణాల్లో తొలుత సేవలు ప్రారంభం అవుతాయి. కానీ, 4జీ మాదిరిగా దేశవ్యాప్తంగా 5జీ కవరేజీ రావాలంటే మరో రెండేళ్లు ఓపిక పట్టాల్సిందే. టెలికం కంపెనీలు 5జీ కోసం తాజాగా స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నాయి. వీటికి ఈ నెలలోనే స్పెక్ట్రమ్ కేటాయిస్తారు. దీంతో కంపెనీలు తగిన ఏర్పాట్లు, సన్నాహాలు చేసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత టవర్లలో 5జీ పరికరాలు అమర్చుకోవాలి. కనుక ఇదంతా జరిగేందుకు ఎంత లేదన్నా రెండేళ్లు అయినా పడుతుంది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ, జామ్ నగర్, చెన్నై, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలను పరీక్షించి చూసింది. కనుక ముందుగా ఈ నగరాల్లో సేవలు మొదలు పెట్టనుంది. భారతీ ఎయిర్ టెల్ తొలిదశలో అన్ని ముఖ్య నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించనుంది. తాజా వేలంలో వొడాఫోన్ ఐడియా నుంచి 5జీ స్పెక్ట్రమ్ కొనుగోళ్లు తక్కువగానే ఉన్నాయి. 4జీ మాదిరే 5జీ సేవలను దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని జియో ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్ కోసం జియో రూ.88వేల కోట్లు, ఎయిర్ టెల్ రూ.43వేల కోట్లు, వొడాఫోన్ రూ.18,800 కోట్లు చెల్లించనున్నాయి.