ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కోత ముప్పు ఎదుర్కొంటున్న తీర ప్రాంతం 20 శాతం పైనే ఉన్నట్లుగా ఇంకాయిస్ (ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్‌ఫర్‌మేషన్ సర్వీసెస్) అధ్యయనంలో తేలినట్లు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
రాష్ట్రంలోని 43.35 శాతం తీరానికి అతి తక్కువగాను, 33.27 శాతం తీరానికి ఓ మోస్తరు కోత ముప్పు ఉన్నట్లుగా ఇన్‌కాయిస్ అధ్యయనం పేర్కొనట్లు తెలిపారు. కోత ముప్పు అతి తీవ్రస్థాయిలో ఉన్న ప్రాంతం 0.55 శాతం ఉన్నట్లు కేంద్రమంత్రి చెప్పారు.
సముద్రమట్టం పెరగకుండా నియంత్రించే చర్యల కోసం జాతీయ విపత్తు ఉపశమన నిధి (ఎన్డీఎంఎఫ్)కి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. దీనికి అదనంగా తీరప్రాంత కోత వలన నిరాశ్రయులైన వారికి పునరావాసం కల్పించేందుకు జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరో వేయి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.